వైసీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని రాజకీయ పరివర్తన పార్టీ (PRP) అధినేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో 70కిపైగా అవమానాలను భరించానని తాను స్వచ్ఛందంగా వైసీపీని వీడలేదని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన తనను అవమానించి బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.

ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఎవరూ కొనసాగలేరని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇతరుల చెప్పుడు మాటలు విని తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఒక మనిషి తట్టుకోలేని విధంగా పార్టీలో తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పలువురు కీలక వ్యక్తులు తమ కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే సుమతీరెడ్డి, బోని గణేశ్‌లు పార్టీలో చేరినట్లు తెలిపారు.

అన్ని కులాలు, మతాలకు సమాన న్యాయం కల్పించాలనే లక్ష్యంతో PRPని ఏర్పాటు చేసినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. రెండు కుటుంబాల పాలనకు భిన్నంగా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. కొత్త పార్టీలో యువతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.

పార్టీలో నియంతృత్వ పోకడలకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికీ సమానంగా అమలయ్యేలా కృషి చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *