విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రతిష్ఠాత్మక CII సమ్మిట్ ప్రారంభం కానుంది. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎంపీ చింతకాయల విజయ్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశం మొత్తం మరోసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని ఇందుకు ‘బ్రాండ్ చంద్రబాబు’ ప్రధాన కారణమని పేర్కొన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని ఆయన నిజమైన ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్’గా నిలుస్తున్నారని విజయ్ వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని విమర్శించారు. గతంలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు.

పరిశ్రమల పేరుతో నమ్మశక్యం కాని సంస్థలతో ఎంవోయూలు చేసుకుని యువతను మోసం చేశారని విమర్శించారు. గతంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏపీ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందని అన్నారు.

పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి

దేశంలోనే అత్యధికంగా 25.3 శాతం పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని ఎంపీ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సింగిల్ డెస్క్ విధానం పారదర్శక పాలన ద్వారా పారిశ్రామికవేత్తలకు మంత్రి నారా లోకేశ్ భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే రూ.11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశలో ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు 24 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్

ఏపీ 8.51 శాతం జీఎస్‌డీపీ వృద్ధిని నమోదు చేసిందని దేశంలో రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచిందని విజయ్ తెలిపారు. ఉత్తరాంధ్రలో గూగుల్ ఏఐ హబ్, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు, రాయలసీమలో ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు పనులు కూడా పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఎంపీ చింతకాయల విజయ్ వెల్లడించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *