
D Educt: Nov 11: ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి నవంబరు 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. గత నెలలో సంక్షిప్త ప్రకటన విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. నవంబరు 4న 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 2,111 ఉన్నాయి. ప్రత్యేక విద్య విభాగంలో ఎస్‌ఏ, ఎస్టీటీ పోస్టులు 350 ఉండగా.. సొసైటీలు, ఇతర యాజమాన్యాల పరిధిలో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులు 260 ఖాళీగా ఉన్నాయి.
డిసెంబరు 20వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల సన్నద్ధత కోసం డిసెంబరు 5న ఆన్‌లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. డిసెంబరు 14వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక సమాధానాల కీని విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు అభ్యర్థులకు వారం రోజుల గడువు ఇస్తారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం మరో వారం రోజులకు తుది సమాధానాల కీని విడుదల చేయనున్నారు.
