మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన కొత్త పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి స్థాపించిన ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరును ప్రస్తావిస్తూ.. అది ‘పరివర్తన పార్టీ’ కాదని, ‘అపరివర్తన అవినీతి పార్టీ’గా పిలవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందుగా విజయసాయిరెడ్డిలోనే పరివర్తన రావాలని వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డి తన వద్ద ఉన్న బ్లాక్ మనీని కాపాడుకునేందుకే తిరిగి రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీని స్థాపించారని కేఏ పాల్ ఆరోపించారు. ఈ పార్టీ ఏర్పాటు వెనుక వైసీపీ అధినేత జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే ఉద్దేశం ఉందని విమర్శించారు. ఇతర రాజకీయ శక్తుల ప్రయోజనాల కోసమే ఈ పార్టీని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యంపైనా కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు అధికారంలో తగిన అవకాశం దక్కడం లేదని అన్నారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు, 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం ఎప్పుడు దక్కుతుందని ప్రశ్నించారు. గతంలో పీఆర్పీ పేరుతో పార్టీ పెట్టిన ఉదాహరణను ప్రస్తావిస్తూ.. విజయసాయిరెడ్డి పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు విజయసాయిరెడ్డి మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని చెబుతున్నారు. టీడీపీ, వైసీపీలపై గతంలోనూ విమర్శలు చేసిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో పార్టీని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ‘దేశం కోసం.. ధర్మం కోసం’ అనే నినాదాన్ని కూడా ప్రకటించారు. ఏపీని రెండు కుటుంబాలే పాలించాలా? అంటూ ప్రశ్నించిన ఆయన, తమ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *