ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ గుర్తింపు లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26లో భాగంగా 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలోని ‘సూపర్ స్వచ్ఛ లీగ్‌’ కేటగిరీలో గుంటూరు నగరం మూడో స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

వ్యర్థాల నిర్వహణలో వినూత్న చర్యలు

గుంటూరు నగరానికి ఈ పురస్కారం దక్కడం వెనుక నగరపాలక సంస్థ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు కీలకంగా నిలిచాయి. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండగా, పచ్చ ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేలా బయో సీఎన్‌జీ ప్లాంటు ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేశారు.

నగర పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ఆధునిక ఎలక్ట్రిక్ ఆటోలు, చెత్త తరలింపు వాహనాలు, కాంపాక్టర్లు, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే నగరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు 30 రోజుల పాటు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పాత వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడంతో పాటు పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టారు.

స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం

పారిశుధ్యం అనేది కేవలం నగరపాలక సంస్థ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మూడో శనివారం ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నగర స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కార్మికుల కష్టానికి దక్కిన జాతీయ గుర్తింపు

ఈ సందర్భంగా కమిషనర్ కె. మయూర్ అశోక్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో లభించిన ఈ పురస్కారం పారిశుధ్య కార్మికుల నిరంతర శ్రమకు, అధికారుల సమష్టి కృషికి, నగర ప్రజల సహకారానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. భవిష్యత్తులో గుంటూరు నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన నవ గుంటూరుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *