ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దేశంలో ఎరువుల ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బృహత్తర ప్రాజెక్టుకు సిద్ధమయ్యాయి. గెయిల్‌ (GAIL), క్రిబ్కో (KRIBHCO) సంయుక్తంగా సుమారు రూ.13,500 కోట్ల పెట్టుబడితో శ్రీకాకుళం జిల్లాలో భారీ యూరియా తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి.

శ్రీకాకుళం జిల్లా మూలపేట కేంద్రంగా ఏడాదికి 1.27 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ)తో త్వరలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 300 నుంచి 400 మందికి పరోక్షంగా సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. పరిశ్రమకు అవసరమైన సుమారు 700 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. అంతేకాకుండా నామమాత్రపు ధరకు భూమి అందించడంతోపాటు రోడ్లు, విద్యుత్‌, నీటి సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చనుంది.

మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల సరఫరాపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీ ఫర్‌ యూరియా-2026’కు ఆమోదం తెలిపింది.

ఈ విధానంలో భాగంగానే మూలపేటలో గెయిల్‌ క్రిబ్కో సంయుక్తంగా యూరియా ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే శ్రీకాకుళం జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి స్థానిక ఉపాధి అవకాశాల కల్పనకు ఊతం లభించే అవకాశం ఉంది. అలాగే దేశీయ ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో వ్యవసాయ రంగానికి కూడా ప్రయోజనం చేకూరనుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *