
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14 రెండో శనివారం అయినప్పటికీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు పనిదినంగా ప్రకటించింది. గత అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా ప్రకటించిన ఆప్షనల్ హాలిడేకు బదులుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాల్లో మార్పులు చేసింది.
అయితే అక్టోబర్ 19న ఎన్నికల విధులు, దసరా ఉత్సవాలు, విజయవాడ సరస్ వంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని సెలవు పొందలేకపోయిన ఉద్యోగులకు నవంబర్ 14న సెలవు వినియోగించుకునే అవకాశం కల్పించింది. సంబంధిత అధికారులు రికార్డులను పరిశీలించి ధ్రువీకరించిన తర్వాతే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మిగిలిన ఉద్యోగులందరూ ఆ రోజు విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.
జ్యుడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
రాష్ట్రంలోని న్యాయాధికారుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం 2026 మార్చి 31 నుంచి వర్తించనుంది. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా పదవీ విరమణకు సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశించారు.
అన్నవరం ఆలయ ఈవోగా లక్ష్మీ శివజ్యోతి
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా (ఈవో) కె.లక్ష్మీ శివజ్యోతిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు శిశు సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయంలో సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న ఆమెను అన్నవరం ఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
