ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన ప్రధాన నిందితులు రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వీరిద్దరూ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది.

ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రాజ్‌ కసిరెడ్డి ఏ1గా, వాసుదేవరెడ్డి ఏ2గా ఉన్నారు. ఇటీవల ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం వీరిద్దరికీ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఈడీ తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ వ్యవహారంలో సుమారు రూ.200 కోట్ల మేర మనీలాండరింగ్‌ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కేసులో రాజ్‌ కసిరెడ్డి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వారు బెయిల్‌పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు విచారణకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఈడీ తన పిటిషన్‌లో వివరించింది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి సుమారు రూ.441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్‌ చేసింది. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం ఏపీ సిట్‌, ఈడీ, ఐటీ శాఖలు తమ తమ పరిధుల్లో విచారణ కొనసాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నిందితులకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని వారు వెంటనే కోర్టు ముందు లొంగిపోయేలా ఆదేశాలు జారీ చేయాలని ఈడీ హైకోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. కోర్టు తీర్పుపై ఈ కేసు తదుపరి పరిణామాలు ఆధారపడి ఉండనున్నాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *