
ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లోని 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి.
రెండో దశలో మొత్తం 1,009 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 260 వార్డులు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 749 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 24,98,152 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 12,92,989 మంది మహిళలు, 12,04,753 మంది పురుషులు ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం 2,801 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
మేయర్ ఛైర్‌పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు ఎస్‌ఈసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. మంగళగిరి-తాడేపల్లి మేయర్ స్థానం ఎస్టీ (జనరల్)కు, రాజమహేంద్రవరం మేయర్ స్థానం ఎస్సీ (జనరల్)కు కేటాయించారు. కాకినాడ మేయర్ స్థానం బీసీ (మహిళ)కు, శ్రీకాకుళం మేయర్ స్థానం మహిళ (జనరల్)కు రిజర్వ్ చేశారు.
ఇక 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 19 స్థానాల్లో 10 స్థానాలను వివిధ రిజర్వేషన్ కేటగిరీల్లో మహిళలకు కేటాయించారు.
అభ్యర్థుల డిపాజిట్లు, ఎన్నికల ఖర్చు పరిమితులు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్ మొత్తాలను కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ చేయాలి. మున్సిపాలిటీల్లో జనరల్ అభ్యర్థులకు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500 డిపాజిట్‌గా నిర్ణయించారు.
