ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయని ప్రకటించారు. ఈ సదస్సులో 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు తెలిపారు.

తాజా పెట్టుబడులతో కలిపి రాష్ట్రం మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిందని వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికలు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందిందని సీఎం పేర్కొన్నారు. గిరిజన థింసా నృత్యం సహా ఆంధ్రప్రదేశ్‌ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలతో అతిథులకు ఆతిథ్యం అందించే ప్రత్యేకత రాష్ట్రానికి ఉందన్నారు.

రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌, ఉక్కు ఉత్పత్తి, సోలార్ వేఫర్లు, సౌర ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో ఏపీ దృష్టి సారించిందని వివరించారు. క్రిటికల్ మినరల్ మిషన్‌, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్‌, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, స్పేస్ విజన్‌, సెమీకండక్టర్ మిషన్‌, లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్‌, మారిటైమ్ మిషన్‌లను ప్రాధాన్య రంగాలుగా గుర్తించినట్లు తెలిపారు.

పెట్టుబడులకు వేగవంతమైన అనుమతులే బలం

ఏపీలో అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’ విధానానికి కియా కార్ల తయారీ పరిశ్రమ మంచి ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించినట్లు తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ కూడా 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంలో ఏపీ ట్రాక్ రికార్డు ఇదేనని వివరించారు.

అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తాం

రాజధాని అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఐకానిక్ భవనాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆహ్వానించారు.

భారీ పెట్టుబడులు ఆధునిక సాంకేతికత, వేగవంతమైన అనుమతులు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎం తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *