
D Spiritual: Nov 12: తిరుమలలో భక్తుల అభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కారంపై టీటీడీ సమీక్ష
భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
టీటీడీ అభిప్రాయ సేకరణ వ్యవస్థ పనితీరు, భక్తుల నుంచి అందుతున్న అభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కారంపై బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, టీటీడీ సేవలపై వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాల ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అన్నప్రసాదం కేంద్రంలో భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలి
నీటి, విద్యుత్ పొదుపుపై భక్తులకు అవగాహన కల్పించాలని, అందుబాటులో ఉన్న వనరులు వృథా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వసతి సముదాయాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
నందకం యాప్‌పై నిరంతర పర్యవేక్షణ
నందకం యాప్ పనితీరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని అదనపు ఈవో తెలిపారు. యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 24 గంటల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, లగేజీ కౌంటర్ల వద్ద భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని సీసీటీవీ కెమెరాలు, ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు.
సేవల నాణ్యత పెంపునకు సమన్వయంతో పనిచేయాలి
భక్తుల అభిప్రాయాలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని అదనపు ఈవో పేర్కొన్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
