D Spiritual: Nov 12: నాగుల చవితి 2026: నవంబర్ 13న పండుగ.. వరుసగా మూడు రోజులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన!

కార్తీక మాసంలో తొలి పండుగ నాగుల చవితి

కార్తీక మాసం అంటేనే పండుగలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేకమైన సమయం. ఈ మాసంలో వచ్చే తొలి పండుగ నాగుల చవితి. ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 13, శుక్రవారం వచ్చింది. చవితి తిథి ఆ రోజు సాయంత్రం వరకు ఉండటంతో భక్తులు శుక్రవారం నాగుల చవితిని జరుపుకోనున్నారు.

పంచాంగ వివరాల ప్రకారం నవంబర్ 12, గురువారం మధ్యాహ్నం 3.39 గంటలకు చవితి తిథి ప్రారంభమై, నవంబర్ 13, శుక్రవారం సాయంత్రం 5.46 గంటల వరకు కొనసాగుతుంది. సాధారణంగా సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే ఆ రోజునే పండుగను నిర్వహించే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 13న నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు జరుపుకోనున్నారు.

నవంబర్ 14న నాగ పంచమి.. ఆ తర్వాత షష్ఠి

నాగుల చవితి మరుసటి రోజు నవంబర్ 14, శనివారం నాగ పంచమి వస్తోంది. ఈ రోజున శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ప్రతి ఏడాది నాగ పంచమి రెండు సార్లు వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో, మరొకటి కార్తీక మాసంలో నిర్వహిస్తారు. నాగ పంచమి మరుసటి రోజు ఆదివారం షష్ఠి పర్వదినం వస్తోంది. ఇలా వరుసగా మూడు రోజుల పాటు భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తారు.

నాగుల పుట్టలకు, ఆలయాలకు పోటెత్తనున్న భక్తులు

ఈ పర్వదినాల సందర్భంగా భక్తులు నాగుల పుట్టల్లో పాలు పోసి నాగదేవతలను ఆరాధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం సమీపంలోని మోపిదేవి, గుడివాడ సమీపంలోని సింగరాయపాలెం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి.

నాగుల చవితి రోజున ఏం చేయాలి?

నాగుల చవితి సందర్భంగా నాగుల పుట్టల్లో పాలు పోసి పూజలు నిర్వహిస్తారు. అలాగే దేవాలయాల్లోని రావి, వేప చెట్ల కింద ఉన్న జంట నాగ ప్రతిమలకు ఆవు పాలతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ సమర్పిస్తారు. స్వామివారికి ఎర్రని పూలతో పూజలు చేసి, చిలిమిడి, పెసరపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారు. ఇలా భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల సర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సుబ్రహ్మణ్యాష్టకం, భుజంగ స్తోత్ర పారాయణం

నాగుల చవితి, నాగ పంచమి, షష్ఠి పర్వదినాల్లో సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయాలని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. ఈ స్తోత్రాలను భక్తితో పఠించడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

నాగదేవత ఆరాధనతో సర్ప దోష నివారణ

నాగుల చవితి పండుగకు సంబంధించి పురాణాల్లో అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా శుక్లపక్ష చవితి తిథి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల సర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. సంతానం లేని వారు ఈ రోజున నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు.

పల్లె ప్రాంతాల్లో రైతులు తమ పంటలను రక్షించుకోవాలనే సంకల్పంతో నాగదేవతలను ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని, వ్యవసాయ భూములు సారవంతం కావాలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తారు. పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు పశుపక్ష్యాదులకు నాగదేవత రక్షణ కల్పిస్తుందని భక్తుల నమ్మకం.

సుఖశాంతుల కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన

నాగుల చవితి, పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. సర్ప దోషాలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయని వారి నమ్మకం. ఈ మూడు పర్వదినాలు భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *