D Spiritual: Nov 12: శబరిమల ఆలయ ప్రవేశంపై ట్రాన్స్‌జెండర్ మహిళకు నిరాకరణ.. కేరళ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్

లింగ నిర్ధారణకు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి: కేరళ ప్రభుత్వం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ట్రాన్స్‌జెండర్ మహిళ ప్రవేశాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. లింగ నిర్ధారణకు సంబంధించి అధికారిక లేదా వైద్య ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఆలయ దర్శనానికి అనుమతించలేమని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు వాదనలతో ఏకీభవిస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

వైద్య, అధికారిక ధ్రువీకరణ పత్రాలు అవసరం

యాత్రికులు మహిళలా లేదా ట్రాన్స్‌జెండర్‌లా అని భౌతికంగా, వైద్యపరంగా పరీక్షించే చట్టపరమైన అధికారం తమకు లేదని ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన వైద్య లేదా అధికారిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుండా ఆలయంలోకి ప్రవేశం కల్పించడం సాధ్యం కాదని పేర్కొంది. సరైన ధ్రువీకరణ లేకుండా అనుమతిస్తే ఆలయ సంప్రదాయాలు, వయసు, లింగ ఆధారిత నిబంధనలకు విఘాతం కలిగే అవకాశం ఉందని బోర్డు తన వాదనల్లో వెల్లడించింది.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మార్పులుండవు

శబరిమల ఆలయ ప్రవేశ నిబంధనలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన వివాదాలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు గుర్తుచేసింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు తాము భిన్నమైన వైఖరి తీసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించింది.

అసలు ఏం జరిగింది?

తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిల రహమతలీ అనే ట్రాన్స్‌జెండర్ మహిళ ఈ ఏడాది జనవరి 3, ఏప్రిల్ 15 తేదీల్లో శబరిమల యాత్ర పూర్తి చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అయితే, ఆగస్టు 20న మరోసారి దర్శనానికి వెళ్తుండగా పంబ గణపతి ఆలయం వద్ద పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమెను అడ్డుకున్నారు. అనంతరం కొండపైకి వెళ్లేందుకు అనుమతించలేదు.

దీంతో తనకు ఆలయ దర్శనానికి అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సత్యశ్రీ షర్మిల రహమతలీ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు తమ వాదనలను కోర్టు ముందు ఉంచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *