అమరావతి, తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు, గతంలో చేసిన పొరపాట్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన CII సదస్సు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రాజకీయ అనుభవాలను, పాలనలో ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. అధికారంలో ఉన్న సమయంలో రెండుసార్లు పొరపాట్లు చేశానని, వాటి నుంచి విలువైన గుణపాఠాలు నేర్చుకున్నానని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్‌.. రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు, అపజయాలు చూశారని, తన దృష్టిలో చేసిన అతిపెద్ద రాజకీయ పొరపాటు ఏమిటని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పగలు, రాత్రి పనిచేయాలనే తపన తనలో ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఒక పని పూర్తికాగానే మరో పని చేయాలనే ఆలోచన వస్తుంటుందని, ఈ క్రమంలో కొన్నిసార్లు సమతుల్యత కోల్పోతానని వివరించారు. అలా గతంలో రెండుసార్లు పొరపాట్లు చేసినట్లు అంగీకరించారు.

అయితే ఆ అనుభవాల నుంచి తగిన పాఠాలు నేర్చుకున్నానని చంద్రబాబు తెలిపారు. ఈసారి పాలనలో అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంపై స్పష్టత ఉందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే తన ప్రస్తుత లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *