శావల్యాపురం: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) ఎల్. శేషాద్రి శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఎన్నికల విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

100 మీటర్ల పరిధిలో బారికేడ్లు

నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది తప్పనిసరిగా బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు.

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు

ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించే వారితో పాటు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొబైల్ పెట్రోలింగ్‌ను మరింత పెంచి, ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ పర్యటనలో వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్య, శావల్యాపురం ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు, పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *