
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు.
పర్యటన షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం పొందడంతో పాటు ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకువచ్చే అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో వరుస తుపానులు ఎల్‌నినో ప్రభావంతో జరిగిన నష్టాన్ని కూడా సీఎం కేంద్రానికి వివరించనున్నారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని నిర్మలా సీతారామన్‌ను కోరనున్నారు. అర్నబ్, మరసు తుపానుల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం.
ఎల్‌నినో పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను కూడా వివరించి కేంద్ర సహకారం కోరనున్నారు. ఇక సాయంత్రం ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నివాసంలో జరిగే శుభకార్యానికి చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం మంగళవారం రాత్రికి ఆయన అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.
