కుటుంబంలోని ఒక వ్యక్తి మరణిస్తే కుటుంబసభ్యులు కొన్ని బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. భావోద్వేగ క్షణాల్లో వీటిని మర్చిపోవడం వల్ల ఆర్ధికంగా సమస్యలు తలెత్తే అవకాశముంది. ఆలస్యం చేయడం వల్ల మరణించిన వ్యక్తి పేరుపై ఉన్న పెట్టుబడులను, ఇతర ఆస్తులను బదిలీ చేసుకోవడంలో ఇబ్బందులు రావొచ్చు.

కుటుంబసభ్యుల్లో ఎవరైనా మరణిస్తే అది కుటుంబానికి పెద్ద కోలుకోలేని దెబ్బగా మిగులుతుంది. ఈ సమయంలో ఆ కుటుంబంలో తీరని శోకం ఏర్పడుతుంది. ఇలాంటి భావోద్వేగ క్షణాల్లో దుఃఖాన్ని దిగమింగుకుంటూనే.. ఆర్ధికంగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో ఆర్ధికంగా ఇబ్బందుల ఎదురుకావొచ్చు. మరణించి వ్యక్తి పేరుపై ఉన్న ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేయడం దగ్గర నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వరకు అనేక ఆర్ధిక అంశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్ధిక బాధ్యతలను తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి. ఒక వ్యక్తి మరణించినప్పుడు కుటుంబసభ్యులు ఏయే పనులు చేయాలనేది ఇందులో చూద్దాం.

ఈ పనులు తప్పనిసరి

ముందుగా మరణించిన వ్యక్తి పేరుపై డెట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి లేదా ఆన్ లైన్ ద్వారా డెట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మరణించిన నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వచ్చే అవకాశముంటుంది. ఆలస్యం చేస్తే ప్రక్రియ క్లిష్టతరంగా ఉంటుంది. మరణించి వ్యక్తి పేరుపై ఉండే పెట్టుబడులు, ఆస్తులు, ఇన్సూరెన్స్ సొమ్ము క్లెయిమ్ చేయాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆ తర్వాత మరణించిన వ్యక్తి పేరుపై ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకోండి. ఇక అతడి పేరుపై ఉండే బ్యాంక్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, పీపీఎఫ్ లాంటి పథకాల్లో ఉండే సొమ్మును తీసుకోండి. పీఎఫ్, గ్రాట్యుటీ, ఇతర బీమా ప్రయోజనాలను కోసం సదరు వ్యక్తి పనిచేసే యాజమాన్యాన్ని సంప్రదించండి. అలాగే మరణించిన వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాలి.

ఆధార్ డీయాక్టివేట్

మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డును వెంటనే డీయాక్టివేట్ చేయండి. కుటుంబసభ్యులు యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లి సింపుల్‌గా డీయాక్టివేషన్ చేయవచ్చు. దీని వల్ల అతడి ఆధార్ కార్డు ద్వారా ఇతరులు ఎలాంటి కార్యకలాపాలు చేయలేరు. అలాగే అతడి పేరుపై ఉండే ఈమెయిల్, సోషల్ మీడియా అకౌంట్లను క్లోజ్ చేయండి. మరణించిన వ్యక్తి ఆస్తులకు సంబంధించి ఏదైనా వీలునామా చేస్తే దాని ప్రకారం పంపిణీ చేసుకోవాలి. అలాగే అతడి వ్యక్తిపై ఏమైనా బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు, తాకట్టు రుణాలు ఉంటే వాటిని చెల్లించండి. అతడి ఆస్తులను పంచుకునేముందు.. తొలుత అతడి పేరుపై ఉన్న అప్పులన్నీ తీర్చేయాలి. దీని వల్ల మీకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవ్. లేకపోతే బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి వివాదాలు రాకుండా ఒక న్యాయవాదిని ఆశ్రయించడం మంచిది. న్యాయవాది సలహాలు, సూచనల ప్రకారం ఆస్తుల పంపకాలు చేసుకోవాలి.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *