ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రావడం లేదు. కనీసం నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి సైతం ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అల్లూరును గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల నామినేషన్ల ప్రారంభ దశలోనే అల్లూరులో అనూహ్య పరిస్థితి ఏర్పడింది. అధికారులు సైతం ఈ పరిణామంపై దృష్టి సారించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇందులో భాగంగా నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సాధారణంగా ఎన్నికల సమయంలో కనిపించే అభ్యర్థుల హడావిడి, ప్రచార సందడి అక్కడ కనిపించడం లేదు. అందుకు బదులుగా ఎన్నికల బహిష్కరణ నినాదాలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి లేదా దాఖలు చేయడానికి ముందుకు రావడం లేదు.

అల్లూరును గ్రామ పంచాయతీ హోదా నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని గతంలో మాదిరిగానే గ్రామ పంచాయతీగా కొనసాగించాలని, నగర పంచాయతీ హోదా తమకు వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయానికి నిరసనగా ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరించాలని స్థానికులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలకు అధికారులు మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బంది తమ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నామినేషన్ల స్వీకరణ రెండో రోజైన ఆదివారం కూడా ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికల కేంద్రాలన్నీ అభ్యర్థులు లేక వెలవెలబోయాయి.

మరోవైపు అల్లూరు ప్రజల ఆందోళనకు స్థానిక రాజకీయ పార్టీలన్నీ మద్దతుగా నిలవడం గమనార్హం. అన్ని ప్రధాన పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సామాన్య ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి నగర పంచాయతీ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.

నగర పంచాయతీ హోదాపై స్థానికుల అభ్యంతరాలు

అల్లూరును నగర పంచాయతీగా మార్చడం వల్ల తమపై పన్నుల భారం పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. తమ జీవన విధానానికి నగర పంచాయతీ హోదా అనుకూలంగా ఉండదని, గతంలో మాదిరిగానే గ్రామ పంచాయతీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని కొనసాగించేందుకు అల్లూరు నాయకులు, స్థానిక ప్రజలు ఏకమయ్యారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఒకే నిర్ణయానికి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల ప్రక్రియలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *