డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ఓఎన్జీసీ ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో వెంటనే సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఓఎన్జీసీ ఛైర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి భద్రతా చర్యలను సమీక్షించాలని అధికారులకు సూచించారు.

కాగా కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజీ జరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా గ్యాస్ భారీగా వెలువడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్యాస్ బావికి కిలోమీటరు పరిధిలో ఉన్న నివాస ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు.

ప్రస్తుతం గ్యాస్ లీకేజీ జరిగిన ప్రాంతంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. గ్యాస్ బావి ముఖద్వారం పటిష్ఠంగానే ఉందని తెలిపారు. భూమికి సమీపంలో గ్యాస్ వ్యాపించకుండా ఓఎన్జీసీ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రమాద నివారణలో భాగంగా డీజిల్ జనరేటర్లు ఇతర విద్యుత్ పరికరాలను నిలిపివేసి సమీప ప్రాంతాల నుంచి తరలించారు.

మరోవైపు, గ్యాస్ లీకేజీని పూర్తిగా నియంత్రించేందుకు సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంటోంది. మరో 4 నుంచి 5 గంటల్లో లీకేజీని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలమని ఓఎన్జీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *