
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన కెరీర్ తొలినాళ్లలో పాకిస్థాన్ పర్యటనలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నాడు. తన తొలి టెస్టు సిరీస్‌లో పాక్‌పై చేసిన 57 పరుగుల ఇన్నింగ్స్ కెరీర్‌కు కీలక మలుపుగా నిలిచిందని తెలిపాడు. అయితే ఆ పర్యటనలో ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్‌లో బాదిన సిక్సర్లే అభిమానులకు ఎక్కువగా గుర్తుండిపోయాయని చెప్పాడు.
ముంబయి క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శరద్ పవార్ మ్యూజియంలో సోమవారం సచిన్ తన కెరీర్లో ఉపయోగించిన 25 బ్యాట్లతో రూపొందించిన ‘బ్యాటోగ్రఫీ’ విభాగాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నాడు.
వర్షం కారణంగా పాకిస్థాన్‌లో తన తొలి మ్యాచ్ రద్దయిందని సచిన్ గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన వేలాది మంది అభిమానులు నిరాశతో వెనుదిరగకుండా ఉండేందుకు నిర్వాహకులు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాలని కోరారని తెలిపాడు. అలా తన జీవితంలో తొలిసారిగా అనధికారిక టీ20 మ్యాచ్ ఆడినట్లు వెల్లడించాడు.
ఆ మ్యాచ్‌లో తొలుత ముస్తాక్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టానని చెప్పాడు. ఆ తర్వాత అబ్దుల్ ఖాదిర్ తన దగ్గరకు వచ్చి.. ‘కుర్రాడిపై ప్రతాపం చూపిస్తున్నావు.. నా బౌలింగ్‌లోనూ సిక్సర్లు కొట్టు’ అని సవాల్ విసిరినట్లు వివరించాడు. దీంతో ఖాదిర్ బౌలింగ్‌లోనూ సిక్సర్లు బాదానని తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఖాదిర్ తనను అభినందించడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు.
అయితే అదే పర్యటనలో జరిగిన నాలుగో టెస్టులో తాను సాధించిన 57 పరుగులు కెరీర్‌కు ఎంతో కీలకమని సచిన్ చెప్పాడు. ఆ ఇన్నింగ్స్ కారణంగానే భారత్ సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోగలిగిందని గుర్తుచేసుకున్నాడు. కానీ అభిమానులు మాత్రం ఆ పర్యటనలో అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్‌లో తాను కొట్టిన సిక్సర్లనే ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారని సచిన్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు.
