
బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ప్రజలపై పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సహాయక పునరావాస చర్యలకు సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే పలు విపత్తులను ఎదుర్కొందని ఇప్పుడు మూడో తుపాను ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుపాను ప్రభావం ప్రజలపై పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపించాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు నేరుగా సమాచారం చేరవేయాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రభుత్వం అధికార యంత్రాంగం అండగా ఉంటుందనే భరోసాను ప్రజల్లో కల్పించాలని తెలిపారు.
సహాయక పునరుద్ధరణ చర్యలకు సిద్ధంగా ఉండాలి
తుపాను కారణంగా చెట్లు కూలినా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా వెంటనే తొలగించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ రహదారుల పునరుద్ధరణ పనులను ఆలస్యం చేయకుండా చేపట్టాలని సూచించారు. పరిస్థితిని రియల్ టైమ్‌లో అంచనా వేస్తూ అవసరమైన రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాలని ప్రభావిత ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించాలని ఆదేశించారు.
అలాగే తుపాను ప్రభావంతో చెరువులు కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను
సమీక్ష సందర్భంగా అక్వాన్ తుపాను ప్రస్తుత గమనం తీవ్రతపై సీఎం చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రానికి తుపాను తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
అదే సమయంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం తుపాను చెన్నైకు 610 కిలోమీటర్లు మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు.
19, 20 తేదీల్లో భారీ వర్షాలు
అక్వాన్ తుపాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
