కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించనున్న రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అంబేడ్కర్ కళావేదిక పరిసరాల్లో నో ఫ్లైయింగ్ జోన్

అమిత్ షా పర్యటనను దృష్టిలో ఉంచుకుని విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అంబేడ్కర్ కళావేదికతో పాటు పరిసర ప్రాంతాలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

వీఐపీల పర్యటన ముగిసే వరకు అనుమతి లేకుండా డ్రోన్లు రిమోట్ కంట్రోల్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు ఇతర ఎగిరే పరికరాలను వినియోగించడం నిషేధమని సీపీ స్పష్టం చేశారు. పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా నిషేధిత ప్రాంతంలో ఎలాంటి ఎగిరే పరికరాలను ఎగురవేయకూడదని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత పరికరాలను స్వాధీనం చేసుకుంటామని సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.

తొమ్మిది మందికి రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు

మరోవైపు రామోజీరావు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో తొమ్మిది మందికి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు.

విజయవాడలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో సాయంత్రం 5.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అమిత్ షా పుణె నుంచి ప్రత్యేకంగా విజయవాడకు చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనుండగా 6.30 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమవుతుంది.

దాదాపు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కేంద్ర హోంమంత్రి పర్యటన పలువురు ప్రముఖుల రాక నేపథ్యంలో విజయవాడలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *