తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వివిధ రకాల సుగంధ పుష్పాలు, పత్రాలతో ప్రత్యేక పుష్పార్చన చేశారు. భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ వేడుక కనులపండువగా సాగింది.

మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ కార్యక్రమం కొనసాగింది. ఉత్సవమూర్తులైన స్వామివారు, అమ్మవార్లను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్పకైంకర్యం నిర్వహించారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, మొల్ల, కనకాంబరం, తామర తదితర 16 రకాల పుష్పాలతో పాటు తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరుతో సహా ఆరు రకాల పత్రాలతో స్వామివారిని అర్చించారు.

ఈ సందర్భంగా వేదపండితులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పయాగం కోసం దాతలు మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను సమర్పించారు.

మరోవైపు పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పుష్పాల సేకరణలో కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులును టీటీడీ పాలకమండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శాలువాతో సత్కరించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *