తొట్టంబేడు: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ వడ్డీ వ్యాపారి మహిళతో పాటు ఆమె ఆరు నెలల పసికందును తమ వెంట తీసుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ పోలీసుల తీరును, కూటమి ప్రభుత్వ స్పందనను ప్రశ్నించింది.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడు నెలల క్రితం ఆది, ఆయన భార్య మేఘమాల శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్‌ల వద్ద రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ రుణానికి నెలకు నూటికి రూ.5 వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అసలు, వడ్డీ సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో నవంబర్ 11న ఆది ఇంట్లో లేని సమయంలో ప్రసాద్, ఆయన కుమారుడు మోహన్ అక్కడికి వెళ్లారు. బకాయి డబ్బులు చెల్లించాలంటూ మేఘమాలతో పాటు ఆమె ఆరు నెలల పసిబిడ్డను తమ వెంట తీసుకెళ్లారు.

ఈ ఘటనతో ఆందోళనకు గురైన మేఘమాల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల జోక్యంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై శనివారం తొట్టంబేడు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాళహస్తి డీఎస్పీ పావని వివరాలు వెల్లడించారు. మేఘమాల ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు మాత్రమే పేర్కొన్నారని, బలవంతంగా తీసుకెళ్లడం లేదా నిర్బంధించడం గురించి ప్రస్తావించలేదని తెలిపారు.

ఈ వ్యవహారంపై పోలీసులు స్టేషన్ నోటీసు జారీ చేసి, కేసు నమోదు చేసేందుకు స్థానిక కోర్టు అనుమతి కోరినట్లు డీఎస్పీ వెల్లడించారు. నవంబర్ 13న తొట్టంబేడు ఎస్సై జారీ చేసిన నోటీసులో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 174 కింద విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. దాడికి పాల్పడినట్లు వచ్చిన మరో ఫిర్యాదుపైనా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ స్పందిస్తూ ప్రజలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అప్పు వసూలు కోసం ఆరు నెలల పసికందును తల్లితో సహా ఇంటి నుంచి తీసుకెళ్లడంపై ప్రశ్నలు లేవనెత్తింది. బలవంతపు రుణ వసూళ్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *