పుట్టపర్తిలో నిర్వహించనున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా శ్రీకాకుళం రోడ్‌ నుంచి యలహంక మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే విజయవాడ నుంచి యలహంకకు మరో ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. సత్యసాయిబాబా జయంతి వేడుకలకు వెళ్లే భక్తులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ రైళ్ల రాకపోకల సమయాలు, నిలిచే స్టేషన్లు, ఇతర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం అందించింది. పుట్టపర్తిలో జరగనున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం విజయవాడ-యలహంక మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు 07246/07247 నంబర్లతో ప్రత్యేక రైలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు యలహంకలో బయలుదేరే 07246 నంబర్‌ రైలు మరుసటి రోజు నవంబర్‌ 22న ఉదయం 7.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07245 నంబర్‌ రైలు నవంబర్‌ 23వ తేదీ రాత్రి 11.50 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు యలహంక చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో ప్రత్యేక రైలు ఆగుతుంది

ఈ ప్రత్యేక రైలు పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, డోన్‌, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్‌, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు స్టేషన్లలో ఆగనుంది.

రైలులో కోచ్‌ల వివరాలు

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక రైలులో వివిధ తరగతుల కోచ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 2 సెకండ్‌ ఏసీ, 4 థర్డ్‌ ఏసీ, 7 స్లీపర్‌ క్లాస్‌, 4 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. వీటితో పాటు ఒక సెకండ్‌ క్లాస్‌ లగేజీ/దివ్యాంగుల కోచ్‌, ఒక జనరేటర్‌ మోటార్‌ కార్‌ కోచ్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు

సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు వెళ్లే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్‌-యలహంక మధ్య మరో ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 08555/08556 నంబర్లతో ఈ రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు 08555 నంబర్‌ రైలు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు నవంబర్‌ 21న మధ్యాహ్నం 3 గంటలకు యలహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08556 నంబర్‌ రైలు నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు యలహంకలో బయలుదేరి, మరుసటి రోజు నవంబర్‌ 25న సాయంత్రం 5.15 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో రైలు హాల్టింగ్‌

ఈ ప్రత్యేక రైలు చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, డోన్‌, గుంతకల్లు, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) స్టేషన్లలో ఆగనుంది.

ప్రత్యేక రైలులో కోచ్‌ల వివరాలు

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో మొత్తం 19 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2 సెకండ్‌ ఏసీ, 4 థర్డ్‌ ఏసీ, 7 స్లీపర్‌ క్లాస్‌, 4 సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ కోచ్‌లు ఉంటాయి. వీటితో పాటు ఒక సెకండ్‌ క్లాస్‌ లగేజీ/దివ్యాంగుల కోచ్‌, ఒక జనరేటర్‌ మోటార్‌ కార్‌ కోచ్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీసత్యసాయి 101వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని సత్యసాయి ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జే. రత్నాకర్‌ వెల్లడించారు. జయంతి వేడుకల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక, సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఈ నెల 18న శ్రీసత్యసాయి రథోత్సవం నిర్వహించనున్నారు. 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అలాగే 20, 21 తేదీల్లో శ్రీసత్యసాయి సేవాదళ్‌ జాతీయ సదస్సులను నిర్వహించనున్నారు.

ఇక ఈ నెల 22న శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సినీనటి రష్మిక ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు రత్నాకర్‌ తెలిపారు.

23న హిల్‌వ్యూ స్టేడియంలో ప్రధాన వేడుకలు

ఈ నెల 23వ తేదీన పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో శ్రీసత్యసాయి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. జయంతి ఉత్సవాల నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *