
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగకుండా మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నవంబర్ 26న సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు 19 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
ఎన్నికలు జరిగే 23 స్థానిక సంస్థల పరిధిలోని ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు నవంబర్ 26న సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్ నిర్వహణ అవసరాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని మరో ఉత్తర్వులో పేర్కొంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నవంబర్ 26నే జరగనున్నాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది.
