
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్లో ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను అలరించిన మాహీ ఇకపై మైదానంలో ఆటగాడిగా కనిపించబోడనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించిన సీఎస్కే యాజమాన్యం తాజాగా ధోనీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించింది. 2008-2015, 2018-2025 మధ్య కాలంలో ధోనీ సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి సారథ్యంలో చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో విజేతగా నిలిచింది. దీంతో ఐదు ట్రోఫీలతో ముంబై ఇండియన్స్‌తో కలిసి అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.
ఐపీఎల్ విజయాలతో పాటు 2010, 2014లో రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను కూడా సీఎస్కే గెలుచుకుంది. ధోనీ నాయకత్వంలో చెన్నై ఏకంగా పదిసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం విశేషం. 2016, 2017 సీజన్లలో సీఎస్కేపై నిషేధం విధించడంతో ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడాడు. 2018లో సీఎస్కే తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ధోనీ నాయకత్వంలోనే టైటిల్ సాధించింది. 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై రవీంద్ర జడేజా చివరి బంతుల్లో బౌండరీలు బాది చెన్నైకి ఐదో టైటిల్ అందించాడు.
చివరి సీజన్లలోనూ ధోనీ విధ్వంసకర బ్యాటింగ్
మోకాలి శస్త్రచికిత్స అనంతరం ధోనీ 2024 ఐపీఎల్ సీజన్లో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. అప్పటినుంచి అతడి బ్యాటింగ్ పాత్రలో మార్పు వచ్చింది. టాప్ ఆర్డర్లో కాకుండా ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి తన పవర్ హిట్టింగ్తో జట్టుకు కీలక పరుగులు అందించాడు.
2023 సీజన్లో 104 పరుగులు చేసిన ధోనీ 182కు పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. 2024లో 11 ఇన్నింగ్స్‌ల్లో 161 పరుగులు చేసి 220.54 స్ట్రైక్‌రేట్ సాధించాడు. 2025 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 196 పరుగులు చేశాడు. 2026 సీజన్లో సీఎస్కే ఆటగాళ్ల జాబితాలో ఉన్నప్పటికీ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
ఐపీఎల్లో చెరగని ముద్ర
ధోనీ తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు సాధించాడు. 38.30 సగటు, 137.45 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు. అతడి ఖాతాలో 24 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు.
సీఎస్కే తరఫున 272 మ్యాచ్‌లు ఆడి 5,314 పరుగులు సాధించాడు. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. సీఎస్కే తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.
ఆటగాడిగా ఎన్నో విజయాలు రికార్డులు అందించిన ధోనీ ఇప్పుడు మెంటార్‌గా సీఎస్కేకు తన అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో మాహీ కొత్త బాధ్యతల్లో జట్టుకు ఎలాంటి మార్గనిర్దేశం చేస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
