
సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి తెరపైకి వచ్చింది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్నా తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభించడం లేదంటూ సూర్యాపేట జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా? ఆర్థిక స్థోమత లేదనే నిర్లక్ష్యమా?’ అంటూ పార్టీలో తనకు ఎదురవుతున్న పరిస్థితులపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తమ గ్రామానికి చెందిన నాతాల వెంకట్రామిరెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని శ్రీరాములు లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామానికి సంబంధించి మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. గతంలో తాను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తన అభిమాన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తుచేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన తనకు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతోందని ప్రశ్నించారు.
పార్టీలో తనను పక్కనపెట్టడానికి కారణాలేమిటో స్పష్టం చేయాలని శ్రీరాములు కోరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిననే వివక్ష చూపుతున్నారా? ఆర్థికంగా బలంగా లేనందున నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇతర నాయకులతో తనకున్న సాన్నిహిత్యంపై అపోహలు ఉన్నాయా? అంటూ తన అసంతృప్తిని లేఖ ద్వారా వెల్లడించారు. తనకు ఎలాంటి గ్రూపులు లేవని, పార్టీలోని నాయకులందరితో కలిసిమెలిసి పనిచేయడమే తన అభిమతమని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కోరారు.
రాజకీయంగా ప్రాధాన్యం కల్పించకపోవడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ తనకు అన్యాయం జరిగిందని శ్రీరాములు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ ఆర్థికంగా ఎదగలేకపోయానని, కనీసం సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ స్థానిక గ్రూపు రాజకీయాల కారణంగా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వ పథకాల విషయంలోనూ న్యాయం జరగకపోవడం బాధాకరమని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
