భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఆయన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ సోషల్ మీడియాలో చేసిన ఓ ప్రత్యేక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ‘కొన్ని అధ్యాయాలు ముగిస్తేనే అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతాయి’ అంటూ తన భర్తకు భావోద్వేగ సందేశాన్ని అందించారు.

సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధోనీకి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ఇన్నేళ్లుగా మహీని ప్రేమించి, మద్దతుగా నిలిచి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమకు వ్యక్తిగతంగా తెలిసినా, తెలియకపోయినా అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. కొత్త ఆరంభాలు, కొత్త ప్రయాణాలు, మరెన్నో మధుర జ్ఞాపకాలకు స్వాగతం పలుకుతూ.. ‘నీ గురించి ఎంతో గర్వంగా ఉంది మహీ’ అంటూ తన ప్రేమను చాటుకున్నారు.

ఈ సందర్భంగా సాక్షి పంచుకున్న ఫొటో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అందమైన పర్వత ప్రాంతంలో ధోనీ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నట్లు ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. చుట్టూ పచ్చని కొండలు, దూరంగా మంచుతో కప్పుకున్న పర్వత శ్రేణులు, ప్రశాంతమైన వాతావరణం మధ్య మహీ ఉన్న ఈ ఫొటోకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

స్పందించిన సీఎస్‌కే

సాక్షి పోస్టుపై అభిమానులతో పాటు ధోనీకి సన్నిహితులు కూడా స్పందిస్తున్నారు. ఈ పోస్టుకు భారీగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సైతం స్పందించింది. ‘నీ గురించి ఎంతో గర్వంగా ఉంది మహీ.. ఎప్పటికీ’ అంటూ సాక్షి సందేశంలోని మాటలను పంచుకుంది. మరోవైపు అభిమానులు ధోనీ తదుపరి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఐపీఎల్‌కు ధోనీ వీడ్కోలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థానం ముగిసిందనే వార్త క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దడంలో ధోనీ కీలక పాత్ర పోషించారు. తన నాయకత్వంలో సీఎస్‌కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించి, ముంబై ఇండియన్స్‌తో సమానంగా నిలిపారు.

2020 ఆగస్టులో ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ, ఇప్పుడు ఐపీఎల్ ప్రయాణానికి కూడా ముగింపు పలికినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. శనివారం జరిగిన సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్ వీడియో కాల్‌లో ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు జట్టు సహ యజమాని రూప గురునాథ్ తెలిపినట్లు సమాచారం. దీంతో క్రికెట్ మైదానంలో మహీ మ్యాజిక్‌ను ఇకపై చూడలేమన్న భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *