
అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సేవలు అందించేందుకు ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు సీఎండీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంప్రదించేందుకు 1912, 9440817561 నంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయాలు ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నంబర్ల ద్వారా అధికారులకు తెలియజేయవచ్చని సూచించారు.
తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సిబ్బంది వెంటనే స్పందించాలని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని సీఎండీ ఆదేశించారు. తుపాను సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రజలు కూడా తుపాను సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పుల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెగిపడిన విద్యుత్ తీగలు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
