
బంగారం ధరలు వరుసగా తగ్గుతుండటంతో గోల్డ్ లోన్లు ఇచ్చే కంపెనీలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పసిడి ధరల పతనం కారణంగా రుణాల వసూళ్లు కష్టతరంగా మారుతున్నాయి. రుణగ్రహీతల నుంచి అసలు వడ్డీ వసూలు చేయడం కంపెనీలకు సవాలుగా మారింది. మరోవైపు రుణాలకు హామీగా తీసుకున్న బంగారు ఆభరణాలను వేలం వేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
పండగల ఖర్చులు, బంగారం ధరల్లో తగ్గుదల ఇతర సీజనల్ ఖర్చుల ప్రభావంతో గోల్డ్ లోన్ చెల్లింపులు మందగించే అవకాశం ఉందని ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 డిసెంబరుతో ముగిసే మూడో త్రైమాసికం (Q3)లో గోల్డ్ లోన్ల వృద్ధి గతంలో ఉన్న స్థాయిలో ఉండకపోవచ్చని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రెసిడెంట్ మయాంక్ శర్మ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బంగారం ధరల్లో కొనసాగుతున్న పతనం ఆగి, ధరలు స్థిరపడిన తర్వాత రుణాలకు హామీగా పెట్టిన బంగారు ఆభరణాల వేలం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి వేలం ప్రక్రియ చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం గోల్డ్ లోన్ తీసుకున్న వారి నుంచి అసలు వడ్డీ వసూలు చేయడమే ప్రధాన సమస్యగా మారిందని వివరించారు.
అయితే రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కొత్తగా మంజూరయ్యే గోల్డ్ లోన్లకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే గతంలో మాదిరిగా భారీ వృద్ధి ఉండకపోవచ్చని త్వరలో గోల్డ్ లోన్ కంపెనీల సమాఖ్య (FGLOC) సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న పినాకినాథ్ బెనర్జీ తెలిపారు.
గోల్డ్ లోన్ కంపెనీల కీలక ప్రతిపాదనలు
గోల్డ్ లోన్ రంగంలోని ఎన్బీఎఫ్సీలకు సంబంధించి పలు విధానపరమైన మార్పులను బెనర్జీ ప్రతిపాదించారు. ముఖ్యంగా ఈ సంస్థల టైర్-1 మూలధన కనీస పరిమితిని ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని సూచించారు.
అదేవిధంగా గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలకు బ్యాంకులు అందించే రుణాలను తిరిగి ప్రాధాన్యతా రంగ రుణాలుగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ రంగంలో స్వీయ నియంత్రణ వ్యవస్థ (Self-Regulatory Framework) ఏర్పాటు చేయాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.
బ్యాంకులు గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలకు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా గుర్తిస్తే ఈ రంగంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మయాంక్ శర్మ తెలిపారు. ప్రస్తుతం గోల్డ్ లోన్లపై ఉన్న 18 నుంచి 20 శాతం వడ్డీ రేటు 5 నుంచి 6 శాతం మేర తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు.
