సెమీకండక్టర్ తయారీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగానికి సంబంధించి నూతన పాలసీకి ఆమోదం తెలిపింది. సిలికాన్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ఏకంగా 80 శాతం వరకు పెట్టుబడి రాయితీ కల్పించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనుందని వెల్లడించారు.

ఈ మేరకు సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0లో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో నం.87 జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’కు అనుగుణంగా ఏపీ నూతన పాలసీని రూపొందించింది. భారత్‌కు అవసరమైన చిప్‌లను ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

సిలికాన్ ఫ్యాబ్‌లకు 80 శాతం పెట్టుబడి రాయితీ

నూతన పాలసీ ప్రకారం సిలికాన్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం మరో 40 శాతం చొప్పున మొత్తం 80 శాతం క్యాపిటల్ సపోర్ట్ అందించనున్నాయి. కాంపౌండ్ సెమీకండక్టర్, ఫోటోనిక్స్, డిస్‌ప్లే ఫ్యాబ్, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ యూనిట్లకు 70 శాతం వరకు, లెగసీ ప్యాకేజింగ్ యూనిట్లకు 50 శాతం వరకు పెట్టుబడి ప్రోత్సాహకాలు కల్పించనున్నారు.

ఈ ప్రోత్సాహకాలతో దేశంలోనే అత్యధికంగా 80 శాతం పెట్టుబడి రాయితీ అందించే రాష్ట్రంగా ఏపీ నిలవనుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఒడిశా, తమిళనాడు 65 శాతం వరకు గుజరాత్ 56 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంది.

తిరుపతిలో 5,000 ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్

సెమీకండక్టర్ తయారీకి తిరుపతిలో 5,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ‘ఏపీ సెమీకండక్టర్ పార్క్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ పార్కులో క్లీన్‌రూమ్స్, అల్ట్రా ప్యూర్ వాటర్ సదుపాయం నిరంతర విద్యుత్ సరఫరా అత్యాధునిక టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ‘APSGIC’ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్నారు. సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

పరిశోధన, నైపుణ్య శిక్షణకు ప్రత్యేక కేంద్రాలు

సెమీకండక్టర్ రంగంలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐఐటీ తిరుపతి వేదికగా ‘ఏపీ సెమీకండక్టర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (AP-SRIC)’ను ప్రారంభించనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ‘AP-STCC’ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందే ఒక్కో ట్రైనీకి నెలకు రూ.10,000 చొప్పున ఆరు నెలల పాటు కంపెనీలకు శిక్షణ రాయితీ అందించనున్నారు. చిప్ డిజైన్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ.22.5 కోట్ల వరకు సీడ్ ఫండింగ్ కల్పించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వ వాటా రూ.7.5 కోట్లుగా ఉండనుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *