D Spiritual: Nov 18: శబరిమలలో అయ్యప్ప మండల-మకరవిళక్కు యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తుల శరణుఘోషతో పంబా తీరం, శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం తరలివస్తుంటారు. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆలయ దర్శనాల నుంచి ప్రత్యేక రైళ్లు, విమానాశ్రయాల్లో హెల్ప్‌డెస్క్‌లు, ప్రసాదాల ఇంటి వద్దకే డెలివరీ, ఉచిత బీమా వరకు అనేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

మండల-మకరవిళక్కు పూజల కోసం శబరిమల ఆలయ గర్భగుడి తలుపులను సోమవారం ఉదయం 5 గంటలకు శాస్త్రోక్తంగా తెరిచారు. మంగళవారం నుంచి రోజువారీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 రోజుల పాటు సాగే మండల యాత్ర నవంబర్ 17న ప్రారంభమై డిసెంబర్ 27 రాత్రితో ముగియనుంది. మండల పూజ అనంతరం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవాల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. 2027 జనవరి 14న పవిత్ర మకరజ్యోతి దర్శనం ఉండగా, జనవరి 20న ఆలయాన్ని మూసివేయడంతో యాత్రా కాలం ముగుస్తుంది.

తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి కేరళలోని కొల్లం మధ్య వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకు మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి నుంచి కొల్లంకు వెళ్లే రైలు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ప్రతి శుక్రవారం రాత్రి 11:45 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 7:55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం ఉదయం 10:40 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి సోమవారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

రైళ్లు, విమానాల ద్వారా వచ్చే భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. శబరిమలకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న చెంగన్నూరు రైల్వే స్టేషన్‌లో దేవస్థానం బోర్డు, రైల్వే శాఖ కలిసి ప్రత్యేక సదుపాయాలు కల్పించాయి. చెంగన్నూరు మహాదేవ ఆలయంలోనూ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వచ్చే భక్తుల వాహనాలను పంబ సమీపంలోని చకుపాలం పార్కింగ్ ప్రాంతం వరకు అనుమతిస్తారు. విమాన ప్రయాణికుల కోసం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ప్రత్యేక హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉంచారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశారు. శబరిమలలోని పవిత్రమైన 18 మెట్లపై గంటకు గరిష్ఠంగా 4 వేల మంది మాత్రమే ఎక్కే అవకాశం ఉంటుంది. రోజుకు 15 గంటల పాటు దర్శనాలు కల్పించినా సుమారు 60 వేల మందికే దర్శనం లభిస్తుంది. అంతకంటే ఎక్కువ మంది భక్తులు వస్తే రద్దీ పెరగకుండా నిలక్కల్ వద్దే అదనపు భక్తులను నిలిపి విశ్రాంతి కల్పిస్తారు. ఇందుకోసం అక్కడ ఒకేసారి 60 వేల మంది సేదతీరేలా భారీ టెంట్లు, తాగునీరు, వాటర్ కూలర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రూ.4.5 కోట్లతో ఏఐ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

భక్తులు ఎంతో ఇష్టపడే అరవణ పాయసం, అప్పం ప్రసాదాలకు కొరత లేకుండా ఉత్పత్తిని పెంచారు. క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐదు సెల్ఫ్ సర్వీస్ అరవణ కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపుల ద్వారా ఒకేసారి ఐదు టిన్ల అరవణ ప్రసాదాన్ని పొందవచ్చు.

ప్రసాదాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, ఇండియా పోస్ట్ కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సన్నిధానంలో 24 గంటల పాటు పనిచేసే పార్శిల్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులు ప్రసాదాలను తమ ఇళ్లకు లేదా బంధుమిత్రులకు పోస్టు ద్వారా పంపించుకోవచ్చు. శబరిమలకు రాలేని భక్తులు కూడా ఇంటి వద్దకే ప్రసాదాలు వచ్చేలా బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.

శబరిమల కొండపై వసతి గదులు పరిమితంగా ఉండటంతో ఆన్‌లైన్ బుకింగ్ కోసం 250 గదులను కేటాయించారు. ఆన్‌లైన్ కోటా పూర్తయిన తర్వాత ఖాళీగా ఉన్న గదులను సన్నిధానంలో నేరుగా బుక్ చేసుకోవచ్చు. గదులు లభించని భక్తుల కోసం పెద్ద పందిళ్లలో శుభ్రమైన ఉచిత వసతి సదుపాయాలను దేవస్థానం బోర్డు కల్పిస్తోంది.

తెలుగు, తమిళ, కన్నడ భక్తులు భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆయా భాషల్లో దారి సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. మైకుల్లో చేసే ప్రకటనలు, భక్తి పాటలను కూడా తెలుగులో వినిపించనున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా ఉండనుంది.

ఈసారి శబరిమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఎల్‌ఐసీ సహకారంతో రూ.2 లక్షల ఉచిత జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. యాత్ర సమయంలో అనుకోని ప్రమాదం కారణంగా భక్తుడు మరణిస్తే ఆయన నామినీకి ఈ పరిహారం అందుతుంది. అందుకే వర్చువల్ క్యూ టికెట్ బుక్ చేసుకునే సమయంలో నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని దేవస్థానం బోర్డు సూచించింది.

శబరిమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణకు భక్తులు సహకరించాలని టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ కోరారు. సంప్రదాయం పేరుతో ఉపయోగించిన దుస్తులను పంబ నదిలో వేయడం వల్ల నది కలుషితమవుతోందని, దీనికి ఆచారాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయకుండా, రసాయన రంగులను ఉపయోగించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు హోటళ్లు, దుకాణాల్లో అధిక ధరలు వసూలు చేయకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ నిశ్చింతగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *