
D Spiritual: Nov 18: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దీంతో భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించింది.
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం నవంబర్ 23న హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. మార్గమధ్యలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకునే అవకాశం ఉంటుంది. తిరుగు ప్రయాణంలో గద్వాల్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించేలా యాత్రను రూపొందించారు. నవంబర్ 27న బస్సు తిరిగి హనుమకొండ చేరుకుంటుంది.
శబరిమలకు ప్రత్యేక సర్వీసులు
కేరళలోని శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారుల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 36 మంది స్వాములు కలిసి బస్సును బుక్ చేసుకుంటే ప్రత్యేక సర్వీసును కేటాయిస్తారు. ఈ బస్సులో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక వంటమనిషికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక యాత్ర
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి, భీమవరంలోని సోమేశ్వర స్వామి, పాలకొల్లులోని క్షీర లింగేశ్వర స్వామి, సామర్లకోటలోని భీమలింగేశ్వర స్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకునేందుకు ప్రతి ఆదివారం హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఒకేరోజు ఐదు పంచారామ క్షేత్రాలను దర్శించుకునేలా ఆర్టీసీ యాత్రను రూపొందించింది.
ఈ యాత్రకు పెద్దలకు రూ.2,300, చిన్నారులకు రూ.1,500 టికెట్ ధరగా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం 96521 24049 నంబరును సంప్రదించవచ్చు.
