
శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ నెల 19, 20 తేదీల వరకు తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తుపాను పరిస్థితులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.
వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేయాలి
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంటల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చేపడుతున్న వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే కోతలు పూర్తిచేసిన రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో కుప్పలుగా చేర్చి, వర్షపు నీరు చేరకుండా టార్పాలిన్లు, ఇతర కవర్లతో కప్పి ఉంచాలని తెలిపారు. ధాన్యం తడవకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
వర్షాల వల్ల సాగు పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ వ్యవసాయ పనులపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
