
శ్రీకాకుళం: అక్వాన్ తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాల వల్ల ధాన్యం తడిసి నష్టపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ ధాన్యంపై టార్పాలిన్లు కప్పడం, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అధికారులు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు
తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని రామ్మోహన్ నాయుడు సూచించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వంశధార, నాగావళి నదులతో పాటు వాటి పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కోరారు.
నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు సూచించిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి
తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. తీరప్రాంత, లోతట్టు, నదీ పరివాహక గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు.
