భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన తొలి ‘TIME100 Next India’ జాబితాలో ఈ 15 ఏళ్ల క్రికెటర్ చోటు సంపాదించాడు. వివిధ రంగాల్లో దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగల 100 మంది ఎదుగుతున్న ప్రతిభావంతులను గుర్తిస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా.. వైభవ్ ప్రతిభను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా ఓ భావోద్వేగ సందేశాన్ని రాశారు.

మారుతున్న భారతదేశానికి ప్రతీక: ఆయుష్మాన్

మైదానంలో వైభవ్ తన బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తున్నప్పుడు.. భవిష్యత్తు అనేది విభిన్నంగా ఆలోచించే వారిదేనని గుర్తుచేస్తాడని ఆయుష్మాన్ కొనియాడారు. వైభవ్ కేవలం అద్భుతమైన క్రీడా ప్రతిభ కలిగిన యువ ఆటగాడు మాత్రమే కాదని, మారుతున్న భారతదేశానికి ప్రతినిధిగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు.

14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా గుర్తింపు పొందిన వైభవ్.. అతి తక్కువ సమయంలోనే తన ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడని ప్రశంసించారు. అతడి వేగవంతమైన ఎదుగుదల ప్రతిభకు ప్రాంతం, నేపథ్యంతో సంబంధం లేదని నిరూపిస్తోందని అభిప్రాయపడ్డారు.

పరుగులు, రికార్డులకు మించిన స్ఫూర్తి

వైభవ్ విజయాన్ని అతడు సాధించిన పరుగులు, నెలకొల్పిన రికార్డులకే పరిమితం చేయలేమని ఆయుష్మాన్ అన్నారు. అతడి ప్రయాణం దేశంలోని లక్షలాది మంది యువతకు పెద్ద కలలు కనడానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కోట్లాది మంది కలలకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం తోడైతే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు. అయితే వైభవ్ తన బ్యాట్‌తోనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడని, అతడి ఆటతీరుతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ప్రత్యేకమని ప్రశంసించారు.

భారత క్రీడాకారులకు కూడా చోటు

ఆయుష్మాన్ ఖురానాకు గతంలో TIME100 జాబితాలో స్థానం లభించడంతో పాటు TIME Impact Award కూడా దక్కింది. అలాంటి వ్యక్తి నుంచి వైభవ్‌కు ప్రశంసలు రావడం ఈ గుర్తింపును మరింత ప్రత్యేకంగా మార్చింది.

వైభవ్‌తో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా, అథ్లెట్ విథ్యా రామరాజ్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రతిభావంతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *