
సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 19: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్, సాగునీటి సరఫరాలో ఇబ్బందులతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకునే దమ్మున్న కాంగ్రెస్ నాయకుడు ఎవరైనా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని నిలదీశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సందర్శించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్‌తో కలిసి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలోనూ క్వింటాకు రెండు కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని ఆరోపించారు. వరి సాగు చేయవద్దని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, రైతులంతా కూరగాయలు పండిస్తే వాటిని కొనుగోలు చేసేదెవరని ప్రశ్నించారు. వ్యవసాయం మానేసి భూములు అమ్ముకుని ఎక్కడికి వెళ్లాలో ప్రభుత్వమే చెప్పాలని నిలదీశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని సౌకర్యాలు అందేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస సమస్యలను కూడా పరిష్కరించడం లేదని విమర్శించారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోయినా కష్టపడి పంటలు పండించామని, తీరా ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే సామర్థ్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే రైతుల బతుకులు బాగుపడతాయని వారు అభిప్రాయపడ్డారు.
