పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఘర్షణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి తీవ్ర విమర్శలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఆ నెపాన్ని టీడీపీపై నెట్టడం సరికాదని మండిపడ్డారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన సింహాద్రిపురం ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి 30 నుంచి 50 వాహనాలతో సింహాద్రిపురం రావాల్సిన అవసరం ఏమొచ్చిందని బీటెక్‌ రవి ప్రశ్నించారు.

అర్బన్‌ ఓటరుగా ఉన్న ఎంపీ అక్కడికి రావడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. గతంలో మున్సిపాలిటీలో జరిగిన కాల్పుల ఘటనతో పాటు తాజాగా చోటుచేసుకున్న ఘర్షణలోనూ అవినాశ్‌ రెడ్డి, దుశ్యంత్‌ రెడ్డిల పాత్రపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పులివెందుల ప్రాంతంలో జరిగిన ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

సింహాద్రిపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

మరోవైపు, శుక్రవారం ఉదయం పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి స్వగ్రామమైన సింహాద్రిపురం మండలంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి పర్యటించారు.

ఈ క్రమంలో మండలంలోని అంకాలమ్మగూడూరు సమీపంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి, బీటెక్‌ రవికి చెందిన వాహనాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి పరస్పరం రాళ్లు, పెట్రోల్‌ బాంబులతో దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అనంతరం నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులతో కలిసి ఎంపీ అవినాశ్‌ రెడ్డి పులివెందుల అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఘర్షణకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాల్సి ఉంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *