బాలలకు ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా 15100 న్యాయసేవాధికార సంస్థ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌. శ్రీలక్ష్మి సూచించారు.

ఏలూరులోని హనుమాన్‌నగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో గురువారం బాలల హక్కులు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాలలను లైంగిక వేధింపులు దాడుల నుంచి రక్షించేందుకు పోక్సో చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ఈ చట్టం కింద నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉందని వివరించారు.

విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తమకు ఎదురయ్యే సమస్యలను దాచిపెట్టకుండా పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోక్సో చట్టం కింద బాధితులకు పరిహారం పొందే అవకాశం కూడా ఉందని తెలిపారు. మారుతున్న చట్టాలు బాలల హక్కులపై విద్యార్థులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని చెప్పారు.

ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా, సురక్షిత స్పర్శ, వ్యక్తిగత భద్రత, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి. హరిబాబుతో పాటు ఉపాధ్యాయులు, ఇతరులు పాల్గొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *