
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు ఆమె సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయడంలో ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ఉక్కు మహిళగా పేరుగాంచిన ఆమె నాయకత్వం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, మంత్రి నర్సింహమూర్తి, చాంద్‌భాషా, గొంటి రామారావు, చంద్రశేఖర్, లీలారాణి, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయంలోనూ ఇందిరాగాంధీకి నివాళులు
శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీవీజీఎస్ శంకరరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ నాయకత్వం అసమాన్యమైనదని కొనియాడారు.
అనంతరం విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘసేవకుడు సోడవరం ఈశ్వరరావు, కేంద్ర గ్రంథాలయ అధికారులు భాస్కరరాజు, ఎం. నీలమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అలాగే స్థానిక గ్రంథాలయంలోనూ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి గ్రంథపాలకుడు ఎన్. రామకృష్ణ, పెద్దలు, గ్రంథాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
