
D Spiritual: Nov 20: శ్రీరంగం రంగనాథస్వామికి టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ.. సంప్రదాయబద్ధంగా వేడుక!
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రమైన శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ తరఫున శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీరంగం ఆలయానికి చేరుకున్న టీటీడీ ఈవోకు ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ ప్రకాష్, ప్రధానార్చకులు శ్రీ సుందరభట్టర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకెళ్లారు. అక్కడ వేదమంత్రాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల నడుమ పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఈవోకు తీర్థప్రసాదాలను అందజేశారు.
తమిళ కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని 2006 సంవత్సరం నుంచి టీటీడీ ప్రతి ఏటా శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని నిరంతరం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమం రెండు ప్రముఖ వైష్ణవ క్షేత్రాల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.
అదేవిధంగా, తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం ఆలయం నుంచి కూడా ప్రతి ఏటా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా రెండు ఆలయాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయాలు భక్తులలో విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
