హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర సవాల్ విసిరారు. దమ్ముంటే సిద్ధిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇటీవల సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై స్పందించిన ఆయన.. ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై నిర్వహించిన సభలో ఆ పథకం గురించి మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్, తన పేర్లను పదేపదే ప్రస్తావించారని విమర్శించారు.

సీఎం తన ప్రసంగంలో మొత్తం 140 సార్లు తమ పేర్లను ప్రస్తావించారని, అందులో కేసీఆర్ పేరు 63 సార్లు, తన పేరు 53 సార్లు, కేటీఆర్ పేరు 24 సార్లు తీసుకున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి ఎంత భయం పట్టుకుందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేసిన హరీశ్ రావు.. చంద్రబాబు జలదోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తానన్నారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, మైక్ కట్ చేయకుండా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *