పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పిస్తూ, వ్యాపార అనుకూల సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ.. కంపెనీల నుంచి ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపు జరగడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలు కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు వ్యాపారాలను విస్తరించాలని సూచించారు. గురువారం దిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన కార్పొరేట్ రంగానికి పలు సూచనలు చేశారు.

ఉద్యోగుల జీతాలు పెంచారా?

2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్ను రేటును 22 శాతానికి తగ్గించామని మోదీ గుర్తుచేశారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో పాటు ఆదాయపు పన్ను రిటర్నులు, రిఫండ్ల ప్రక్రియను కూడా సులభతరం చేసినట్లు చెప్పారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను ఉపశమనం కల్పించడం వల్ల ప్రజల చేతిలో ఖర్చు చేసేందుకు మరింత డబ్బు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.

అయితే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు ఎంతవరకు అందుతున్నాయని కంపెనీలను ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్త నియామకాలు చేపట్టారా? అని నిలదీశారు. ప్రభుత్వం తన బాధ్యతను నెరవేరుస్తున్నప్పుడు, పరిశ్రమలు కూడా ఉపాధి కల్పన, వేతనాల పెంపు విషయంలో చొరవ చూపాలని స్పష్టం చేశారు. ప్రతిదానికీ ప్రభుత్వం ముందడుగు వేయాలని ఆశించడం సరికాదని వ్యాఖ్యానించారు.

పన్ను చెల్లింపుదారులకు గౌరవం ఇవ్వాలి

దేశ అభివృద్ధిలో రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, సంపద సృష్టికర్తలు, పన్నులు చెల్లించే వారికి కీలక పాత్ర ఉంటుందని ప్రధాని అన్నారు. వారిని నిరంతరం విమర్శించకుండా గౌరవించాలని సూచించారు.

2001-02లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రతి పన్ను చెల్లింపుదారుడిని అనుమానంతో చూడటం సరైన విధానం కాదని అప్పట్లో ప్రశ్నించినట్లు తెలిపారు. దేశానికి సేవ చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులకే పరిమితం కాదని, ప్రతి పౌరుడు, వ్యాపారి కూడా దేశ పురోగతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందరి కృషిని గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *