
ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్లాలని భావిస్తున్న ఆమె.. ప్రయాణానికి అవసరమైన పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను మరోసారి కోరారు. అయితే హసీనాను భారత్ నుంచి అప్పగించాలని ఢాకా ప్రభుత్వం పట్టుబడుతోంది.
79 ఏళ్ల షేక్ హసీనా 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కూలిపోవడంతో భారత్‌కు వచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. నిరసనకారులపై అణచివేతకు సంబంధించిన కేసులో బంగ్లాదేశ్ న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది. అయినప్పటికీ స్వదేశానికి తిరిగి వెళ్లి న్యాయస్థానం ఎదుట లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలలో ఆమె వెల్లడించారు.
పాస్‌పోర్టు కోసం రెండోసారి విజ్ఞప్తి
హసీనా తరఫున వ్యవహరిస్తున్న లండన్‌కు చెందిన న్యాయ సంస్థ మ్యాట్రిక్స్ ఛాంబర్స్ నవంబర్ 9న న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు ఈ-మెయిల్ పంపింది. ఆమెకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరింది. అయితే హసీనా తరఫున వాదనలు వినిపించేందుకు ఆ న్యాయ సంస్థకు అధికారిక అనుమతి లేదని బంగ్లాదేశ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరోవైపు, హసీనా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె తిరుగు ప్రయాణానికి సంబంధించిన పత్రాల జారీ, అప్పగింత అంశాలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
