
D Spiritual: Nov 21: భట్టిప్రోలు: మండల కేంద్రమైన భట్టిప్రోలులోని సాధనమండలి బ్రహ్మ విద్యాశ్రమంలో చాతుర్మాస్య వ్రత దీక్షల సమాప్తి సందర్భంగా శుక్రవారం 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆశ్రమ అధ్యక్షురాలు బూర్లే అరుణకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉదయం సాధనమండలి ఉపాధ్యక్షురాలు కోట సంధ్యారాణి, శివన్నారాయణ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం చిన్మయానంద స్వామి శిష్యులు అక్కినపల్లి తుకారాం విశిష్ట అతిథిగా విచ్చేయగా, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞంలో అచ్యుత నాగ రమేష్–సాయి సంధ్య, పాలకుర్తి మనోహర్–మాధవి, కపిలవాయి శ్రీనివాసరావు–ఝాన్సీ రాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం దీపోత్సవం నిర్వహించిన అనంతరం సుమారు వెయ్యి మంది భక్తులకు కార్తీక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
