క్రీడల ద్వారా పేద, అనాథ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న హైదరాబాద్ యాట్ క్లబ్ (YCH)కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ సెయిలింగ్ ఎలెవంత్ అవర్ ఇంపాక్ట్ అవార్డు-2026’ను ఈ సంస్థ సొంతం చేసుకుంది. శుక్రవారం చైనాలోని కింగ్‌డావోలో నిర్వహించిన ప్రపంచ సెయిలింగ్ వార్షిక అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని అందజేశారు. దక్షిణాఫ్రికా, అమెరికా, జర్మనీ వంటి దేశాల నుంచి వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి ఈ అవార్డును గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడా సంస్థగా హైదరాబాద్ యాట్ క్లబ్ గుర్తింపు పొందింది.

పేద పిల్లలకు సెయిలింగ్‌లో ఉచిత శిక్షణ

2009లో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ కేంద్రంగా ప్రారంభమైన యాట్ క్లబ్.. మురికివాడలు, ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలకు చెందిన పిల్లల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తోంది. ఆర్థిక పరిస్థితులు ప్రతిభకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో చిన్నారులకు సెయిలింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది పిల్లలకు క్రీడారంగంలో కొత్త అవకాశాలు కల్పిస్తోంది.

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూ..

సెయిలింగ్‌లో ఆసక్తి ఉన్న పిల్లలకు అవసరమైన పడవలు, క్రీడా పరికరాలు, పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు, విద్య, ప్రయాణ ఖర్చులను సైతం క్లబ్ ఉచితంగా భరిస్తోంది. క్రీడలతో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇస్తూ చిన్నారులను అంతర్జాతీయ స్థాయి సెయిలర్లుగా తీర్చిదిద్దుతోంది.

3 వేల మందికి పైగా చిన్నారులకు శిక్షణ

హైదరాబాద్ యాట్ క్లబ్ ఇప్పటివరకు 3 వేల మందికి పైగా పిల్లలకు సెయిలింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చింది. వీరిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 29 అంతర్జాతీయ, 332 జాతీయ స్థాయి పతకాలను సాధించారు. క్లబ్ వ్యవస్థాపకుడు సుహీం షేక్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. పేద పిల్లలకు క్రీడల్లో అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైదరాబాద్ యాట్ క్లబ్ సేవలకు ఈ అంతర్జాతీయ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *