
రాజకీయాల్లో వీడ్కోలు అనేది ఉండదని కార్పొరేటర్‌గా ఉన్నా మాజీ కార్పొరేటర్‌గా ఉన్నా ప్రజాసేవలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో నిర్వహించిన చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో కార్పొరేటర్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలతో మమేకమై పనిచేసే వారికి ఎప్పుడూ గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ఎత్తులు పైఎత్తులు సహజమని అయితే ఎన్నికల తర్వాత అందరూ కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ పరస్పర సహకారంతో ప్రజలకు సేవ చేద్దామని అన్నారు.
బాధపెట్టి ఉంటే క్షమించండి మేయర్ రూప్‌కుమార్
ఈ సందర్భంగా ప్రస్తుత మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కార్పొరేషన్లో అందరం కలిసి పనిచేశామని గుర్తుచేశారు. డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన తాను రేపటి నుంచి మేయర్‌గా విధుల్లోకి రానున్నట్లు తెలిపారు.
కార్పొరేషన్ సమావేశాల్లో తన మాటలు లేదా వ్యవహారశైలి వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. కొత్త పాలకవర్గం దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లి ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సమావేశంలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.
