
ఏలూరు జిల్లా పరిషత్‌కు తొలి చైర్‌పర్సన్‌గా చింతమనేని సాయి నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ముదినేపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొర్రా చలమయ్య ఎన్నికయ్యారు. శుక్రవారం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు.
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. తొలుత జిల్లాలోని మొత్తం 27 మంది జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు.
పెదవేగి జడ్పీటీసీ సభ్యురాలు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీ పేరును ద్వారకా తిరుమల జడ్పీటీసీ సభ్యురాలు కరుటూరి సత్య శ్రావణి ప్రతిపాదించగా కామవరపుకోట జడ్పీటీసీ సభ్యురాలు మందలపు జాహ్నవి బలపరిచారు. మరో అభ్యర్థి లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి బొర్రా చలమయ్య పేరును జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ సభ్యురాలు గొల్లమందల సంకీర్తన ప్రతిపాదించగా టి.నరసాపురం జడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి సుజాత బలపరిచారు. ఈ పదవికి కూడా మరో నామినేషన్ లేకపోవడంతో చలమయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ఇద్దరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఘనంగా అభినందనలు
ఏలూరు జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సాయి నవ్యశ్రీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఆమె తండ్రి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు పూలమాలలతో ఆమెను సత్కరించారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జడ్పీ సీఈవో ఇన్‌చార్జి జి. వెంకటనాయుడు, డిప్యూటీ సీఈవో కె. భీమేశ్వర్, జడ్పీ కార్యాలయ సిబ్బంది నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు మేయర్‌గా ఎన్నికైన రెడ్డి అప్పలనాయుడు జడ్పీ కార్యాలయానికి చేరుకుని సాయి నవ్యశ్రీని అభినందించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, ఏలూరు తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో జరిగిన జడ్పీ ఎన్నికల్లో కూటమి తరఫున 24 మంది సభ్యులు ఎన్నిక కాగా, వైసీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నూతన జడ్పీ పాలకవర్గం కొలువుదీరింది.
