ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంథ్రోపిక్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)తో ఆ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగుల సంపద భారీగా పెరిగింది. వారిలో భారతీయ సంతతికి చెందిన సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) కృష్ణారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐపీఓ తర్వాత కంపెనీ షేర్ల విలువ పెరగడంతో ఆయన వాటా విలువ బిలియన్ డాలర్ల స్థాయిని తాకింది.

95 లక్షల షేర్లతో బిలియనీర్ క్లబ్‌లోకి

43 ఏళ్ల కృష్ణారావు ఆంథ్రోపిక్‌లో సుమారు 94.97 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. నవంబర్ 19న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ సందర్భంగా షేరు ధర 111.50 డాలర్లకు చేరడంతో ఆయన వాటా విలువ సుమారు 1.06 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇంట్రాడేలో షేరు ధర 115.10 డాలర్ల గరిష్ఠాన్ని తాకడంతో వాటా విలువ మరింత పెరిగింది.

అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర 97.17 డాలర్లకు తగ్గింది. దీంతో ఆయన వాటా విలువ సుమారు 923 మిలియన్ డాలర్లకు చేరింది. అంటే ఈ సంపద షేర్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కించినదే తప్ప, ఆయన చేతికి అందిన నగదు కాదు.

రెండు ఐపీఓల్లో కీలక పాత్ర

యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన కృష్ణారావు.. 2024 ఏప్రిల్‌లో ఆంథ్రోపిక్ సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎయిర్‌బీఎన్‌బీలో 2015 అక్టోబర్ నుంచి 2021 జులై వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ సంస్థ పబ్లిక్ ఇష్యూ ప్రక్రియలోనూ కీలకంగా వ్యవహరించారు. అనంతరం ఫ్యానాటిక్స్ కామర్స్ వంటి సంస్థల్లోనూ ఆర్థిక విభాగ బాధ్యతలు నిర్వహించారు.

ఆంథ్రోపిక్‌లో చేరిన సమయంలో కంపెనీ విలువతో పోలిస్తే.. ఐపీఓ తర్వాత దాని మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో సంస్థలో ఆయనకున్న షేర్లు, స్టాక్ ఆప్షన్ల విలువ కూడా గణనీయంగా పెరిగింది. ఒకే వ్యక్తి రెండు ప్రముఖ టెక్ కంపెనీల ఐపీఓలతో అనుబంధం కలిగి ఉండటం కృష్ణారావు కెరీర్‌లో ప్రత్యేకతగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *